Monday, December 2, 2013

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి చెందిందెలా?:వనం జ్వాలా నరసింహారావు

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి చెందిందెలా?

వనం జ్వాలా నరసింహారావు

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!

నమస్తే తెలంగాణ (10-12-2013)

గత ఏడాది మొదటిసారి సింగపూర్ వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు, నగరంలో తిరుగుతుంటే, ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం, ఎలా అతి కొద్ది కాలంలో సింగపూర్ ఇంతగా అభివృద్ధి చెందిందని! ప్రపంచ దేశాలలో, అత్యంత ఆధునిక ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది బహుశా ఇక్కడేనేమో! సంపన్న దేశాలలో ముందు వరుస నున్న వాటిలో సింగపూర్ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ప్రధాన ద్వీప దేశం ఇది. గణతంత్ర సింగపూర్‌గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్ వలస రాజ్యంగా వున్న సందర్భంలోను, పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్ర్యం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ-ఆర్థిక చరిత్ర ఒక దానితో మరొకటి పోల్చడం చాలా కాష్టం. అలాంటి దేశాలలో సింగపూర్‌ ప్రత్యేక స్థానం సంతరించుకుంది. ఐదారు దశాబ్దాల క్రితం వరకూ, దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే వుండేది సింగపూర్. అలాంటిది, ఈ నాటి సింగపూర్ లాగా, ఒక పటిష్టమైన జాతిగా మనుగడ సాధించగలుగుతుందని, బహుశా ఎవరూ ఊహించి వుండరు.

ఐరోపా దేశాల ఆధిపత్యానికి గండి పడి, రెండో ప్రపంచ యుద్ధానంతరం పరిస్థితులు మారిపోవడంతో, వలస రాజ్యాలకు స్వాతంత్ర్యం లభించడంతో పాటు, సింగపూర్ స్థితిగతులు కూడా మార్పుకు గురయ్యాయి. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నామకార్థం మిగిలిపోయింది. కామన్వెల్త్ దేశాల అధ్యాయం మొదలైంది. ఆ నేపధ్యంలో, తొలుత సింగపూర్ మలయాలో విలీనమై, మలేసియాలో భాగమైంది. రెండేళ్లకే సింగపూర్‌ను వదిలించుకుంది మలేసియా. సింగపూర్ జాతిపితగా, ఆ దేశ ఆవిర్భావ కారకుడిగా గుర్తింపు తెచ్చుకున్న "లీ క్వాన్ యూ" దేశ ప్రధాని అయ్యారు. ఈ నాటికీ, 90 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా, ఆ దేశ రాజకీయాలను పరోక్షంగా శాసిస్తూ, ప్రభుత్వ పాలనలో ప్రధాన పాత్ర పోషిస్తూ వున్నారాయన. గత ఏబై ఏళ్ల సింగపూర్ చరిత్రలో ఇంతవరకూ కేవలం ముగ్గురే ప్రధానులయ్యారు. ప్రస్తుతం ప్రధానిగా వున్న "లీ సూన్ లూంగ్" అయన పెద్ద కుమారుడు. కొడుకు మంత్రి వర్గంలో కూడా ఆయన "మెంటర్ మినిస్టర్" గా గత ఏడాది వరకూ పని చేశారు.


            సింగపూర్ చరిత్ర వెనుక, అభివృద్ధి వెనుక ఏముంది తెలుసుకోవడానికి, పుస్తకాల దుకాణాలు వెతుకుతుంటే, లీ క్వాన్ యూ రాసిన 800 పేజీల బృహత్ గ్రంథం దొరికింది. "ఫ్రం థర్డ్ వరల్డ్ టు ఫస్ట్" అనే ఆ పుస్తకం, సింగపూర్ యువతరానికి సందేశాత్మకంగా రాశారాయన. ఆవిర్భావం నుంచి గత శతాబ్దం చివరిదాకా, సింగపూర్‌కు ఎదురైన చేదు-తీపి అనుభవాల గురించి, ఆటుపోట్ల గురించి వివరంగా వుందా పుస్తకంలో. సింగపూర్ అభివృద్ధి ఆషామాషీగా జరిగింది కాదని, దేశ స్థిరత్వానికి, అభివృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు, తన కాలం నాటి నాయకులు, ఆ తరువాత వచ్చిన వారు ఎంతో కృషి చేశారని ఉదాహరణలతో సహా వివరించారు. కేవలం 640 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో, సహజ వనరులనేవి ఏ మాత్రం లేకుండా, చైనా-బ్రిటీష్ ఇండియా-డచ్-ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారి మధ్య ఐక్యత సాధించుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం వెనుక వున్న సుదీర్ఘమైన చరిత్ర రాశారు.

1942-1945 మధ్య కాలంలో, జపాన్ ఆక్రమణ కింద సింగపూర్ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ క్వాన్ యూ. సింగపూర్ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసుకున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లుబుకింది. 1950 లో సింగపూర్ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. కేవలం 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్ యూ, ఆయన సహచరులు, సింగపూర్‌ను మలయాలో విలీనం చేస్తే బాగుంటుందని నమ్మడం, సెప్టెంబర్ 1963 లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు, మలేసియా నుంచి సింగపూర్ వేరు పడడానికి దారితీశాయి. ఫలితంగా, ఆగస్ట్ 1965 లో సింగపూర్, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. 42 సంవత్సరాల లీ క్వాన్ యూ దేశ ప్ర ప్రధమ ప్రధానిగా, ఇరవై లక్షల మంది ప్రజల రక్షకుడిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 28, 1990 వరకు ఆ పదవిలో కొనసాగి, తన వారసుడిగా గో చోక్ టోంగ్ ను ప్రధానిని చేసి, ఆయన మంత్రివర్గంలోనే సీనియర్ మినిస్టర్ గా పని చేశారు.



1965 లో బాధ్యతలు స్వీకరించిన లీ, నాడు నెలకొన్న పరిస్థితులలో, తన దేశం మనుగడ సాగించడం కూడా కష్టంగా భావించాడు. ఐనా ప్రస్థానం మొదలెట్టాడు. సింగపూర్ ఒక సహజమైన భౌగోళిక దేశం కాదు. సహజ వనరులు లేనే లేవు. కేవలం మానవ నిర్మితమైన ఒక చిన్న ద్వీప దేశం. ఒకానొక రోజుల్లో బ్రిటీష్ ప్రభుత్వం తన అవసరాలకు నావికా సైనిక స్థావరంగా ఉపయోగించుకున్న ప్రాంతమది. శరీరం లేని గుండె ఎలా వుంటుందో, పరిసరాలు లేని సముద్రం మధ్యలో నిర్మితమైన ఒక చిన్న లంక ప్రదేశం. దారీ తెన్ను లేని మార్గం గుండా, గమ్యం అంటే ఏమిటో తెలియకుండా, ఆగస్ట్ 9, 1965 న తన-తన ప్రభుత్వ ప్రయాణాన్ని ప్రారంభించాడు లీ క్వాన్ యూ . అంతా అగమ్య గోచరంలా కనిపించినా ధైర్యంగా ముందుకు సాగారు. ప్రాధాన్యతలలో ముఖ్యమైంది సైనిక సంపత్తిని సమకూర్చుకోవడం. అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని, ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్‌ను సహాయం కోరుతూ ఉత్తరాలు రాశాడు లీ. ఇద్దరూ జవాబివ్వడం అభినందించడం జరిగింది కాని సహాయం విషయంలో పెదవి విప్పలేదు. ఇక సింగపూర్ కష్టాలిన్ని అని చెప్పలేం. వాటన్నిటినీ అధిగమించారు. పటిష్టమైన, నాణ్యమైన, ప్రొఫెషనల్ సైనిక-ఆయుధ పాటవాన్ని సమకూర్చుకున్నారు. పాతికేళ్ల తరువాత, 1990 లో, లీ క్వాన్ యూ పదవీ విరమణ చేసే నాటికి, సింగపూర్ సైనిక బలగాలు అత్యంత బలీయమైన విగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

1965 లో సింగపూర్ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు, ఒకానొక రోజున, ఆ దేశం ప్రపంచ స్థాయి ఆర్థిక లావాదేవీల కేంద్రం అవుతుందని కాని, అగ్ర రాజ్యాల సరసన వాటిని కూడా శాసించే స్థాయికి ఎదిగి, సంపన్న దేశాలలో ఒకటిగా అవుతుందని కాని, బహుశా ఎవరూ ఊహించి వుండరు. అదెలా జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ తీరును లీ క్వాన్ యూ తన పుస్తకంలో సవివరంగా రాశాడు. ఈ నాడు, ప్రపంచ దేశాలన్నీ తమ కార్యాలయాలను, బాంకులను సింగపూర్‌లో నెలకొల్పి, అను క్షణం ఆ దేశంతో లండన్, న్యూయార్క్, టోక్యో, ఫ్రాంక్ ఫర్ట్, హాంగ్ కాంగ్ లాంటి అగ్రశ్రేణి నగరాలతో కంప్యూటర్ అనుసంధాన కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీని కంతా 1968 లో బీజం పడింది. దానికొక బృహత్తర ప్రణాళికను పకడ్బందీగా రచించడం జరిగింది. అది రూపు దిద్దుకున్న ప్రక్రియ ఆసక్తికరంగా వుంటుంది.

అప్పట్లో, ప్రపంచ ఆర్థిక లావాదేవీలు జురిచ్ నగరంలో మొదలయ్యేవి. స్విట్జర్లాండ్ బాంకులు ఉదయం 9 గంటలకు కార్యకలాపాలు మొదలెట్టేవి. ఆ తరువాత ఫ్రాంక్ ఫర్ట్, లండన్ నగరాలలో కొనసాగేవి. మధ్యాహ్నం వర కల్లా, వరుసగా, జురిచ్, ఫ్రాంక్ ఫర్ట్, లండన్ లలో కార్యకలాపాలు ముగిసేవి. మధ్యలో న్యూయార్క్ లో మొదలయ్యేవి. అంటే, లండన్ నేరుగా లావాదేవీల బాధ్యతలను న్యూయార్క్ కు బదలాయించేది. మధ్యాహ్నం కల్లా న్యూయార్క్ లో కూడా ముగిసేవి. అప్పటి కల్లా సాన్ ఫ్రాన్ సిస్కోకు బదలాయించడం జరిగేది. సాన్ ఫ్రాన్ సిస్కోలో ముగిసిన తరువాత, ప్రపంచ వ్యాప్తంగా కూడా లావాదేవీలు ముగిసి, మర్నాటి ఉదయం స్విస్ కాలమానం ప్రకారం 9 గంటల వరకు, అంటే స్విస్ బాంకులు తెరుచుకునేంత వరకు, ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడేది. సాన్ ఫ్రాన్ సిస్కోలో ముగియడానికి ముందర, కార్యకలాపాలను సింగపూర్ కు బదలాయించి మర్నాటి ఉదయం వరకూ కొనసాగించే ఆలోచన లండన్ లో చేశారు. అలా 24 గంటలూ లావాదేవీలు నిరాటంకంగా కొనసాగే ఏర్పాటు మొదటిసారి చేయడం జరిగింది. శైశవ దశలో వున్న సింగపూర్‌కు అదొక పెను సవాల్. ఆ సవాలును స్వీకరించింది ప్రభుత్వం. ప్రపంచ స్థాయి బాంకు లావాదేవీలు జరగడానికి అవసరమైన మౌలిక వసతులను, మానవ వనరులను, నైపుణ్యాన్ని, ధైర్యాన్ని కలిపించింది. క్రమేపీ 24 గంటలూ ఆ దేశం నుంచే లావాదేవీలు జరగడం కూడా మొదలయ్యాయి. ఆసియన్ డాలర్ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసి, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు కూడా నిర్వహించడం మొదలైంది. ఇక అప్పటినుంచి అంతా సింగపూర్ మయమే!


కేవలం 67 సంవత్సరాల వయసున్నప్పుడే, నవంబర్ 1990 లో, లీ క్వాన్ యూ ప్రధాని పదవి నుంచి స్వచ్చందంగా వైదొలగారు. తన వారసుడిగా మంత్రివర్గ సహచరుడైన "గో చోక్ టోంగ్" నియమించి, ఆయన మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా కొనసాగాడు. దేశ ప్రధానిగా పాతిక సంవత్సరాలకు పైగా వున్న వ్యక్తి, సీనియర్ మంత్రిగా తన జూనియర్ కింద పనిచేయడం బహుశా ఒక అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. తన మంత్రివర్గ సహచరులు, తన వారసుడి మంత్రివర్గ సహచరులు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు, సివిల్ సర్వెంట్లు, నైపుణ్యంతో, నిబద్ధతతో పాలనా బాధ్యతలు నిర్వహించడం వల్లనే, దేశాభివృద్ధి సాధ్యపడిందని తన పుస్తకంలో రాశాడు లీ. ఆయన, ఆయన సహచరులు, ఎప్పటికప్పుడు కొత్త ముఖాలను రాజకీయాల్లోకి తేవాలని భావించేవారు. విలువలతో కూడిన వ్యక్తులను తమ వారసులుగా చూడాలనేదే వారి అభిమతం. 1968 ఎన్నికలలో పలువురు పీహెచ్‌డీలను, మేధావులను, ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను, వృత్తి నైపుణ్యం కల ఇంజనీర్‌లను, డాక్టర్లను, లాయర్లను, పాలనానుభవం కల ఇతరులను పోటీకి దింపారు. లీ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. నెగ్గిన 58 మందిలో 18 మంది కొత్త వారే! 40 శాతం పైగా అభ్యర్థులు విశ్వవిద్యాలయ స్థాయి విద్యనభ్యసించారు.

ఆరేళ్ల వయసులో, కట్టెతో చేసిన ఎద్దుల బండిలో, సరైన రహదారి కూడా లేని మార్గంలో ప్రయాణం చేసి, తండ్రి పొలంలో పనిచేసిన లీ క్వాన్ యూ, ఏబై ఏళ్ల తరువాత, సూపర్ సానిక్ విమానంలో, మూడు గంటలు మాత్రమే ప్రయాణం చేసి లండన్ నుంచి న్యూయార్క్ చేరుకున్న విషయం తన పుస్తకంలో ప్రస్తావించి, దానికి కారణం విశ్వవ్యాప్తంగా జరిగిన సాంకేతికాభివృద్ధి అంటారు. మొదటి సారి అధికారాన్ని చేపట్టినప్పుడు, తమకు పాలనానుభవం లేకపోయినా, తమ నిబద్ధత, సమాజాన్ని బాగుచేయాలన్న తపన, ముందుకు సాగిపోయే ట్లు చేసిందంటారు. "ఆన్ ద జాబ్ ట్రెయినింగ్" లాగా, పదవిలో వుండగానే తానెంతో నేర్చుకున్నానంటారు. విమర్శలనెప్పుడూ ఆయన లెక్క చేయలేదు. రాజకీయ వారసత్వం ఎలా రూపుదిద్దుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. 30-40 ఏళ్ల వయసున్న వారిని రాజకీయాలలోకి లాగడంలో ఆయన దిట్ట. ఒక పథకం ప్రకారమే, తన వారసత్వాన్ని 1990 లో, గో చోక్ టోంగ్ కు బదలాయించారు. గో చోక్ తరువాత 2004 లో, తన పెద్ద కుమారుడు, లీ సూన్ లూంగ్ ప్రధాని కావడానికి మార్గం సుగమం చేశాడు.  వారిద్దరూ కూడా తమ మంత్రివర్గంలో, తమ ముందున్న ప్రధానులను, ఉప ప్రధానులను సీనియర్ మంత్రులుగా కొనసాగించారు.

          పారిశ్రామికంగా, సాంకేతికంగా, ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా, ఔత్సాహికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సింగపూర్ ముందుంది. భవిష్యత్ లో సింగపూర్ ఇదే విధంగా కొనసాగుతుందా? అంటే వేచి చూడాల్సిందే. 


No comments:

Post a Comment